సర్పంచ్ పదవికి వేలం.. రూ.73 లక్షలకు దక్కించుకున్ను మహిళ..!

గోల్డెన్ న్యూస్ / చుండూరు /  తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పదవుల పందేరం కొనసాగుతోంది. ఏకగ్రీవాల కోసం చాలా గ్రామాల్లో రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పదవి వ్యామోహంతో లక్షలు, కోట్లు పెట్టి వేలం పాటలు పాడుతున్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఓటు హక్కు ద్వారా నాయకులను  ఎన్నుకోవడం సాధారణం కాగా.. అందుకు విరుద్ధంగా వేలం పాటలు నిర్వహించి సర్పంచ్  ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా..నల్గొండ జిల్లా చండూరు మండలం నల్గొండ  బంగారిగడ్డ గ్రామ పంచాయతీకి 11 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. గ్రామస్థులందరూ గ్రామాభివృద్ధే ధ్యేయంగా భావించి ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం గ్రామంలో అందరూ కూర్చొని చర్చించగా.. గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయం, గ్రామ అభివృద్ధి కోసం తాము సిద్ధంగా ఉన్నామని నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులు తెలిపారు. దీనికి గ్రామస్థులందరూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి రూ.73 లక్షలతో గ్రామ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. దీనికి అభ్యర్థులందరూ అంగీకారం తెలుపుతూ దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకుంటామంటూ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. దీంతో ఆ గ్రామపంచాయతీ స్థానం ఏకగ్రీవమైంది. కాగా అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram