రెండేళ్లలో 576 మంది మావోయిస్టుల లొంగుబాటు: డీజీపీ శివధర్ రెడ్డి

రెండేళ్లలో 576 మంది మావోయిస్టుల లొంగుబాటు: డీజీపీ శివధర్ రెడ్డి

 

గత రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో మొత్తం 576 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ లొంగుబాట్ల సందర్భంగా మావోయిస్టులు 144 హైక్వాలిటీ ఆయుధాలను కూడా భద్రతా బలగాలకు అప్పగించినట్టు ఆయన తెలిపారు.

 

లొంగిపోయిన వారిలో 4 గురు సెంట్రల్ కమిటీ సభ్యులు, 5 గురు స్టేట్ కమిటీ సభ్యులు ఉండటంతో పాటు, పలువురు కీలక స్థాయి నేతలు కూడా ఉన్నారని డీజీపీ పేర్కొన్నారు. ఇది మావోయిస్టు సంస్థకు తీవ్ర ఎదురుదెబ్బగా ఆయన అభిప్రాయపడ్డారు.

 

ఈ సందర్భంగా ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులను ఉద్దేశించి డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, “మీ నాయకులే లొంగిపోయిన పరిస్థితుల్లో మీరు అక్కడ ఉండి ఏం లాభం లేదు. ప్రభుత్వ పునరావాస విధానాలను వినియోగించుకుని ప్రధాన ప్రవాహంలోకి రావాలి” అని పిలుపునిచ్చారు.

 

రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram