ఆస్తి కోసం చెల్లెలిని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన అన్న
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో జరిగిన మహిళా న్యాయవాది స్వప్న దారుణ హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి వివాదం కారణంగా ఇబ్బంది పెడుతోందన్న కోపంతో, స్వప్నను ఆమె అన్నే సుపారీ గ్యాంగ్‌కు అప్పగించి హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఉదయం స్వప్న పొలానికి వెళ్లిన సమయంలో, ముసుగులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా కుటుంబ సభ్యులను విచారించగా, ఆస్తి విషయంలో అన్న–చెల్లెల్ల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇదే క్రమంలో అన్నే సుపారీ గ్యాంగ్‌ను ఆశ్రయించి ఈ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, న్యాయవాది హత్యపై న్యాయవర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.









