బాలల భద్రతపై అవగాహన, CMRF చెక్కుల పంపిణీ
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కరకగూడెం మండలంలోని రైతు వేదికలో అంగన్వాడీ టీచర్లకు 49 స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్, స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, టీనేజ్ ప్రెగ్నెన్సీలు మరియు ఎలొప్మెంట్ కేసుల నివారణ వంటి కీలక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి అంగన్వాడీ సిబ్బందికి మార్గదర్శకాలు అందించారు.
లబ్ధిదారులకు CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూఅంగన్వాడీ కేంద్రాలు గ్రామ స్థాయిలో బాలల అభివృద్ధికి పునాది వంటివని తెలిపారు. చిన్నారుల శారీరక, మానసిక వికాసం మాత్రమే కాకుండా, వారి భద్రత మరియు సంరక్షణలో అంగన్వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ ఫోన్ల ద్వారా పిల్లల వివరాలను సమయానికి నమోదు చేయడం, పోషకాహార పర్యవేక్షణ, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సమాచారాన్ని ట్రాక్ చేయడం వంటి సేవలు మరింత సమర్థవంతంగా అందించవచ్చని పేర్కొన్నారు.
యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి పెద్ద ముప్పుగా మారుతోందని, దీనిని అరికట్టేందుకు గ్రామ స్థాయిలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్ నేరాల నుండి పిల్లలను రక్షించేందుకు తల్లిదండ్రులకు, విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం చేయాలని కోరారు. టీనేజ్ ప్రెగ్నెన్సీలు మరియు ఎలొప్మెంట్ కేసులు సమాజంలో ఆందోళనకర విషయాలని, వాటి నివారణకు సమష్టి కృషి అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ఎమ్మార్వో వట్టం కాంతయ్య, ఎంపీడీవో డి.వి. కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ స్ఫూర్తి, ఆర్‌ఐ, జిపిఓ, జిపి సెక్రటరీ, మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, నాగ బండి వెంకటేశ్వర్లు,ఎర్ర సురేష్, పోలేబోయిన తిరుపతయ్య, తొలెం నాగేశ్వరావు, రాందాస్ నాయక్, కృష్ణ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








