వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల సాగు చర్యలు చేపట్టాలి

రైతులకు వ్యవసాయ శాఖ అధికారి బాబురావు సూచనలు

 

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం /జిల్లా రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో జూన్ 8వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో రానున్న రోజుల్లో సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

 

వర్షాధార పంటల సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నందున రైతులు పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం వంటి పంటల సాగుకు సిద్ధం కావాలని సూచించారు. విత్తనాల ఎంపికలో ధృవీకరించబడిన, నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.

 

పొలాల్లో అధిక తేమ లేకుండా నీరు నిల్వ కాకుండా కాలువలు ఏర్పాటు చేయాలని, నేలలో తగిన తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేయాలని సూచించారు. కృష్ణా జిల్లాలో సాధారణం కంటే తక్కువ, ములుగు జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

 

చెరువులు, కుంటలు మరియు ఇతర నీటి వనరులను శుభ్రపరచి వర్షపు నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడరాదని, పశువులను కూడా అక్కడ ఉంచరాదని రైతులకు హెచ్చరించారు.

 

 

వేరుశనగ, సోయాబీన్, జొన్న, పెసర, కంది, మినుము వంటి పంటల విత్తనాలను విత్తే ముందు శాస్త్రీయ పద్ధతిలో విత్తన శుద్ధి చేయడం ద్వారా ప్రారంభ దశలో వచ్చే వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. వరి నారుమళ్ల కోసం నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకొని, తెలంగాణ సోనా (RNR-15048) వంటి అధిక దిగుబడి రకాలను వినియోగించాలని సూచించారు.

 

 

వాతావరణ శాఖ జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుని సాగు పనులు చేపట్టాలని రైతులకు వ్యవసాయ శాఖ అధికారి బాబురావు విజ్ఞప్తి చేశారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram