గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల ట్రాప్ లో సంగారెడ్డి జిల్లాలోని విద్యుత్ శాఖ అదనపు సహాయ ఇంజనీర్ బి. రామకృష్ణారెడ్డి చిక్కారు.
ఏసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడీఏలో ఆపరేషన్స్ విభాగంలో అదనపు సహాయ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బి. రామకృష్ణారెడ్డి, ఫిర్యాదుదారుడి నుంచి రూ.25 వేల లంచాన్ని డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా గురువారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి రూ.25 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజా విధులను నిజాయితీగా నిర్వహించాల్సిన అధికారి తన పదవిని దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది.
అనంతరం నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.








