సీతమ్మసాగర్–సీతారామ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను పుష్కలంగా అందిస్తాం
ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
గోల్డెన్ న్యూస్ / అశ్వాపురం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతమ్మసాగర్ బ్యారేజ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం నీటిపారుదల శాఖ అధికారులు మ్యాప్‌లు, సాంకేతిక నమూనాల ద్వారా బ్యారేజ్, పంప్‌హౌస్‌లు, కాలువలు, విద్యుత్ అనుసంధానం, పంపింగ్ వ్యవస్థ, ఆయకట్టు, ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలిన పనులు, అవసరమైన నిధులు తదితర అంశాలను మంత్రులకు వివరించారు.
గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గోదావరి నదిలో ప్రవహిస్తున్న నీటిని సాధ్యమైనంత మేర పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో గ్రావిటీ ద్వారా, అవసరమైన చోట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు.
జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో రాజీవ్ సాగర్ ప్రాజెక్టు రూ.1,640 కోట్లతో రెండు లక్షల ఎకరాలకు, ఇందిరా సాగర్ ప్రాజెక్టు రూ.1,680 కోట్లతో మరో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించబడినట్లు తెలిపారు. మొత్తం సుమారు రూ.3,500 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళిక రూపొందించబడిందన్నారు.
రాష్ట్ర విభజనకు ముందు ఈ రెండు ప్రాజెక్టులపై సుమారు రూ.2,000 కోట్ల వరకు వ్యయం జరిగిందని, మిగిలిన పనులకు సుమారు రూ.1,505 కోట్లు అవసరమయ్యే పరిస్థితి ఉండేదన్నారు. అనంతర కాలంలో ప్రాజెక్టు పునఃరూపకల్పనతో అంచనా వ్యయం సుమారు రూ.24 వేల కోట్లకు పెరిగిందని, ఇప్పటికే రూ.7,500–8,000 కోట్ల వరకు వ్యయం జరిగినట్లు వివరించారు.
ప్రస్తుతం భారీ ప్రజాధనం ఇప్పటికే వ్యయమైనందున మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీతమ్మసాగర్, సీతారామ, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థలను సమన్వయం చేసి గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి నెలా పనుల పురోగతిని సమీక్షిస్తూ అవసరమైన నిధులు విడుదల చేసి ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు .
సీతారామ ప్రాజెక్టును నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టు అని అన్నారు . ఇప్పటికే ప్రాజెక్టుపై గణనీయమైన ప్రజాధనం వ్యయమైనందున మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందన్నారు.
రాష్ట్రంలో ఇరిగేషన్ రంగంపై గతంలో సుమారు రూ.1.81 లక్షల కోట్లకు పైగా వ్యయం జరిగినప్పటికీ అనేక ప్రాజెక్టులు ఇంకా వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై సుమారు రూ.27,500 కోట్లు వ్యయం జరిగినట్లు తెలిపారు . ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (NDSA), కేంద్ర జల సంఘం (CWC) సూచనల మేరకు సాంకేతిక పరీక్షలు, భూగర్భ పరిశీలనలు, నిర్మాణ భద్రతా అధ్యయనాలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిపుణుల నివేదికల ఆధారంగా అవసరమైన పునరుద్ధరణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు . ప్రజల భద్రత, నిర్మాణ నాణ్యత, నీటి నిల్వ సామర్థ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని నిర్ణయాలు శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగానే తీసుకుంటున్నామని వివరించారు.
సీతారామ ప్రాజెక్టులోని పంప్‌హౌస్‌లు, బ్యారేజ్, కాలువలు, విద్యుత్ అనుసంధానం, పంపింగ్ వ్యవస్థల నిర్మాణాన్ని వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గత రెండున్నర సంవత్సరాలలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండించి రైతుల ఖాతాల్లో రూ.80 వేల కోట్లకు పైగా రైతులకు నేరుగా జమ చేసినట్లు తెలిపారు . ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో నిలిచిందన్నారు. సీతమ్మసాగర్–సీతారామ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారు 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ పై ఉన్న న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకొని త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చూస్తామన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి జిల్లా లో గోదావరి జలాలను వినియోగించే విధంగా అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలో కూడా నీరు అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు.
ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
సీతమ్మసాగర్ బ్యారేజ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీలించి మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు అవసరమైన ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర పనుల కోసం సుమారు రూ.1,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు .
గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోకుండా పంపింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి నీటి వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన అన్ని పనులను వేగవంతం చేస్తున్నామని, అవసరమైన చోట అదనపు నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని అన్నారు .
జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రాజెక్టు పనుల ప్రస్తుత పురోగతి, భూసేకరణ, పునరావాసం, విద్యుత్ అనుసంధానం, అనుబంధ మౌలిక సదుపాయాల కల్పన, శాఖల మధ్య సమన్వయంపై మంత్రులకు వివరించారు. ప్రాజెక్టు పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులు, భూ సంబంధిత అంశాలను వేగవంతంగా పరిష్కరిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై జిల్లా స్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, శాఖల సమన్వయంతో పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు వివరించారు.
అనంతరం మంత్రులు మారెళ్ళ పాడు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి,జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, నీటిపారుదల శాఖ అధికారులు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సంబంధిత శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.










