డబ్బు, బంగారం కోసం వరుస హత్యలు.. పోలీసుల అదుపులో లేడీ కిల్లర్

డబ్బు, బంగారం కోసం వరుస హత్యలు.. లేడీ కిల్లర్ అరెస్ట్

సిద్దిపేట జిల్లా లో డబ్బు, బంగారం కోసం వరుస హత్యలకు పాల్పడుతున్న లేడీ కిల్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సిద్దిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఏసీపీ రవీందర్రెడ్డితో కలిసి సీపీ రష్మీ పెరుమాళ్ కేసు వివరాలను వెల్లడించారు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారు రోడ్డు పక్కన ఈ నెల 8న పాక్షికంగా కాలిపోయిన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు భూంపల్లిలోని డబుల్ బెడ్రూం కాలనీలో నివాసముండే అతికం విజయ (45)గా పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా సీసీ కెమెరాల ద్వారా భూంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత, ఆమె కుమారుడిని నిందితులుగా గుర్తించారు. వీరు స్థానికంగా కిరాణ దుకాణం, టీస్టాల్ నిర్వహిస్తున్నారు.

రజిత భర్త అనారోగ్యంతో బెడ్పై ఉంటున్నాడు. రజిత తన మైనర్ కుమారుడితో కలిసి ఒంటరి మహిళలను హత్య చేసి, బంగారు ఆభరణాలు దొంగిలించి, వాటిని విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే వీరి ఇంటికి దగ్గర్లో ఒంటరిగా ఉంటున్న అతికం విజయ ఈ నెల 8న కిరాణ షాప్నకు రాగా ముందస్తు ప్రణాళిక ప్రకారం లోపలికి పిలిచి ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలు తీసుకున్నారు. అదే రోజు రాత్రి మృతదేహాన్ని ఎక్స్ప్రెల్ వాహనంపై రామక్కపేట శివారులో పెట్రోల్ పోసి కాల్చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram