పథకాలు అర్హులందరికీ చేరేలా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి.

మైనారిటీలు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కమిటీలు కీలకం.

 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / తెలంగాణ శాసనసభ స్పీకర్ ఛాంబర్‌లో శాసన మండలి, శాసన సభలకు సంబంధించిన మైనారిటీ సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీల ప్రారంభ సమావేశం జరిగింది.

 

ఈ సమావేశంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, శాసన సభ, శాసన మండలి సభ్యులు, కార్యదర్శులు నరసింహాచార్యులు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ. .ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన కమిటీల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా కమిటీలు పనిచేయాలని సూచించారు.

 

మైనారిటీలు, వెనుకబడిన తరగతుల ప్రజలకు విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కమిటీలు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు అందించాలని కోరారు.

 

ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరుతున్నాయా లేదా అనే అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అమలులోని సమస్యలు, లోపాలను గుర్తించి ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేయాలని తెలిపారు.

 

శాసన మండలి, శాసన సభ సభ్యులు రాజకీయాలకు అతీతంగా సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కమిటీల సభ్యులు తమ అనుభవం, అవగాహనతో మైనారిటీలు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి దోహదపడే సూచనలు అందించాలని ఆయన కోరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram