మృతిచెందిన సర్పంచుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి…
సర్పంచుల గౌరవ వేతనం రూ.20 వేలకు పెంచాలి
ప్రతి పంచాయతీకి ఏడాదికి రూ.5 లక్షల ప్రత్యేక నిధులు కేటాయించాలి…
ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాలి…
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం: గ్రామపంచాయతీల అభివృద్ధి, సర్పంచుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కరకగూడెం మండల గ్రామపంచాయతీల సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు చౌలం కేశవరావు, ఉపాధ్యక్షుడు కల్తి విజయ్‌కుమార్ కోరారు. సర్పంచులు తమ పదవీకాలంలో ప్రజలకు సేవలందిస్తూ విధులు నిర్వహిస్తున్న సమయంలో మృతి చెందితే, వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం సర్పంచులకు అందుతున్న గౌరవ వేతనం తక్కువగా ఉందని, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచాలని కోరారు. గ్రామపంచాయతీల పరిపాలన సక్రమంగా సాగేందుకు పంచాయతీ కార్యదర్శులకు రెండు గ్రామపంచాయతీల బాధ్యతలు అప్పగించకుండా, ఒక్కో కార్యదర్శికి ఒక్క పంచాయతీ బాధ్యత మాత్రమే అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే 2011 జనాభా లెక్కల ఆధారంగా కొనసాగుతున్న సిబ్బంది కేటాయింపులను ప్రస్తుత జనాభాకు అనుగుణంగా సవరించాలని కోరారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధుల నిర్వహణ తదితర పనులకు సిబ్బంది కొరత ఏర్పడకుండా అవసరమైన మేరకు ఎంపీడీవో వర్కర్ల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతి గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం సంవత్సరానికి కనీసం రూ.5 లక్షల ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిధులను పంచాయతీ సాధారణ నిధులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా వినియోగించే అవకాశం కల్పించాలని కోరారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్వహణ, ప్రజల అవసరాల పరిష్కారానికి ఈ ప్రత్యేక నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సర్పంచుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి గ్రామపంచాయతీల అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు..








