పినపాక నియోజకవర్గానికి రూ.70 కోట్ల పంచాయతీరాజ్ నిధులు
మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు కృతజ్ఞతలు
పినపాక నియోజకవర్గ అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా HAM లో రూ.70 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరాతో సహా), మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారికి పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు భద్రాద్రి రామయ్య స్వామివారి ప్రసాదాన్ని అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలో రహదారులు, హై లెవెల్ బ్రిడ్జిలు, బీటీ రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ఈ రూ.70 కోట్ల నిధులు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు సులభంగా వెళ్లేందుకు, ప్రజలు వైద్య సేవల కోసం ఆసుపత్రులకు చేరుకునేందుకు, రైతులు తమ పంటలను మార్కెట్లకు తరలించేందుకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
అలాగే వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగిపొర్లిన సమయంలో రాకపోకలకు ఏర్పడే ఇబ్బందులు తగ్గి, అత్యవసర సమయాల్లో అంబులెన్సులు, ఇతర వాహనాలు సైతం సులభంగా రాకపోకలు సాగించే అవకాశం ఏర్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
పినపాక నియోజకవర్గ ప్రజల అవసరాలను గుర్తించి రూ.70 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి సీతక్కకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు అన్నారు. రాబోయే రోజుల్లోనూ పినపాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని ఆయన కోరారు.








