సెప్టెంబర్ 28–30 సమ్మెపై UFBU కీలక నిర్ణయం.. శనివారం సెలవుల డిమాండ్‌పై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ : బ్యాంకు ఖాతాదారులకు భారీ ఊరట లభించింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా జరగాల్సిన మూడు రోజుల బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మధ్య ఆదివారం రాత్రి జరిగిన చర్చలు ఫలించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆదివారం రాత్రి 9.30 గంటలకు జరిగిన సమావేశంలో బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లపై చర్చించారు. ముఖ్యంగా అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలన్న డిమాండ్పై ఇరువర్గాలు చర్చించాయి.
నివారం సెలవులపై ఉన్నతస్థాయి కమిటీ
మిగిలిన శనివారాలను సెలవులుగా ప్రకటించే అంశాన్ని పరిశీలించేందుకు IBA–UFBU ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించి, సంబంధిత వర్గాలతో చర్చించి, ఖాతాదారుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిష్కారం కోసం ప్రయత్నించనుంది.
PLI సహా ఇతర అంశాలపైనా చర్చలు
స్కేల్-IV, అంతకంటే పైస్థాయి అధికారులకు సంబంధించిన Performance Linked Incentive (PLI) విధానంపై కూడా IBAతో చర్చలు ప్రారంభించేందుకు అంగీకారం కుదిరింది. 2024 మార్చి 8న జరిగిన చర్చల్లో పెండింగ్‌లో ఉన్న ఇతర అంశాలను కూడా త్వరగా పరిష్కరించేందుకు చర్చలు కొనసాగించనున్నారు.
నేడు బ్యాంకులు పనిచేస్తాయా?
సమ్మె వాయిదా పడటంతో సెప్టెంబర్ 28న బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. దేశవ్యాప్తంగా మూడు రోజుల సమ్మె కారణంగా ఏర్పడే సేవల అంతరాయం ప్రస్తుతానికి తప్పింది. అయితే స్థానిక శాఖల పనివేళలు లేదా ప్రత్యేక ఏర్పాట్లు మారే అవకాశం ఉన్నందున అవసరమైతే సంబంధిత బ్యాంకు శాఖను ముందుగా సంప్రదించడం మంచిది.
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే సమ్మె పూర్తిగా రద్దు కాలేదు.. వాయిదా మాత్రమే పడింది. ఉన్నతస్థాయి కమిటీ చర్చలు, IBA–UFBU మధ్య తదుపరి చర్చల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకోనున్నాయి.








