నల్లబెల్లి : మెడికల్ కౌన్సిల్, ఐఎంఏల ప్రోద్బలంతో ఆర్‌ఎంపీలపై అధికారులు దాడులు నిర్వహించడం వల్ల గ్రామీణ ప్రజలకు అందుతున్న ప్రాథమిక వైద్య సేవలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు ఎస్.ఎన్. హరిబాబు అన్నారు
వైద్యులు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఆర్‌ఎంపీలు ప్రజలకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45 వేల మంది ఆర్‌ఎంపీలు లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఆర్‌ఎంపీలపై చర్యలు తీసుకునే ముందు ప్రతి గ్రామంలో క్వాలిఫైడ్ వైద్యులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హరిబాబు కోరారు. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఆర్‌ఎంపీలు అందిస్తున్న సేవలను విస్మరించరాదన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉందని, అందులో వైద్య సౌకర్యం కూడా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఆర్‌ఎంపీల సమస్యను కేవలం వారి వ్యక్తిగత సమస్యగా కాకుండా గ్రామీణ ప్రజల వైద్య అవసరాలకు సంబంధించిన అంశంగా ప్రభుత్వం, అధికారులు గుర్తించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని హరిబాబు విజ్ఞప్తి చేశారు.
.







