నిత్యావసర ధరల పెరుగుదల !
వంటింటి భారం బాగా పెరిగింది!
గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ /నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్యుడి వంటింటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నెలనెలా ఆదాయం పెద్దగా పెరగకపోయినా.. ఇంటి ఖర్చులు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. బియ్యం, పప్పులు, వంట నూనెలు, పంచదార, కూరగాయలు వంటి నిత్యావసరాల ధరలు కుటుంబ బడ్జెట్‌ను దెబ్బతీస్తుండగా.. మరోవైపు కల్తీ వస్తువుల బెడద వినియోగదారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
నిత్యావసర ధరలు హడలెత్తిస్తున్నాయి
సోయాబీన్ నూనె లీటర్ సగటు ధర రూ.166, సన్‌ఫ్లవర్ నూనె రూ.190, పల్లీ నూనె రూ.190, పామాయిల్ రూ.152.68గా ఉంది. కందిపప్పు కిలో రూ.124, మినపప్పు రూ.122, పెసరపప్పు రూ.110, శనగపప్పు రూ.87గా ఉన్నాయి. పంచదార కిలో రూ.54, ఉప్పు రూ.22గా నమోదయ్యాయి.
కూరగాయల విషయానికొస్తే.. ఉల్లిపాయ కిలో సగటు ధర రూ.60, టమాటా రూ.40, బంగాళాదుంప రూ.24గా ఉంది. బియ్యం కిలో సగటు ధర రూ.45గా ఉంది. నిత్యావసరాల ధరలు పెరగడంతో మధ్యతరగతి, పేద కుటుంబాలు నెలవారీ బడ్జెట్‌ను సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. గతంలో కొనుగోలు చేసిన సరుకులకే ఇప్పుడు ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. పప్పులు, నూనెలు వంటి ప్రధాన వంట సరుకుల ధరలు పెరగడం నేరుగా వంటింటి ఖర్చులపై ప్రభావం చూపుతోంది.
ఇప్పటికే ఇంటి అద్దె, విద్య, వైద్యం, విద్యుత్, రవాణా వంటి ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు నిత్యావసర ధరల పెరుగుదల అదనపు భారంగా మారుతోంది. నెలాఖరుకు వచ్చేసరికి చేతిలో డబ్బు మిగలని పరిస్థితి ఏర్పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పండగల సీజన్.. మరింత ఖర్చు..!
అక్టోబర్ మాసం అంటేనే వరుస పండగల సందడి. తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానమున్న బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, దసరా, అనంతరం దీపావళి వంటి ముఖ్యమైన పండగలు ఇదే సమయంలో వస్తాయి. పండగల సందర్భంగా కొత్త బట్టలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి, స్వీట్లు, నిత్యావసర సరుకుల కొనుగోళ్లతో కుటుంబాల ఖర్చులు భారీగా పెరుగుతాయి.
ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు పండగల ఖర్చులు మరింత భారంగా మారే అవకాశం ఉంది. ధరలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడం సాధ్యం కాకపోయినా.. కనీసం ఈ సమయంలో కొలతల్లో వ్యత్యాసం లేకుండా, కల్తీ పదార్థాలు మార్కెట్‌లోకి రాకుండా అధికారులు పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
పండగల సమయంలో స్వీట్లు, నూనెలు, పప్పులు, కారం, పసుపు, పాలు, పండ్లు తదితర ఆహార పదార్థాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు అధిక ధరలు వసూలు చేయడం, తక్కువ కొలతలు ఇవ్వడం, నాణ్యత లేని లేదా కల్తీ పదార్థాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్వీట్ల తయారీలో ఉపయోగించే నూనె, నెయ్యి, పాలు, ఇతర ముడి పదార్థాల నాణ్యతపై అధికారులు దృష్టి సారించాలి. మార్కెట్లలో విక్రయిస్తున్న ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించడంతోపాటు.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలి.
కొలతల్లో మోసం లేకుండా చూడాలి..!
ధరల పెరుగుదలతో పాటు కొలతల్లో జరిగే మోసం వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతుంది. కిలో పేరుతో తక్కువ బరువు ఇవ్వడం, ప్యాకెట్లలో నిర్ణీత పరిమాణం లేకపోవడం, ధరల పట్టికలు ప్రదర్శించకపోవడం వంటి అంశాలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాలి.
పట్టణంతోపాటు మండల కేంద్రాలు, ప్రధాన మార్కెట్లలో ప్రత్యేక తనిఖీ బృందాలతో పర్యవేక్షణ చేపడితే వినియోగదారులకు కొంత భరోసా కలుగుతుంది. వ్యాపారులు తప్పనిసరిగా బిల్లులు జారీ చేసేలా చూడడంతోపాటు.. అనుమానాస్పద సరుకులపై ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థను కూడా బలోపేతం చేయాలి.
కల్తీకి అడ్డుకట్ట వేయాలి..!
ఒకవైపు ధరల పెరుగుదల.. మరోవైపు కల్తీ భయం సామాన్యులను వెంటాడుతోంది. పాలు, వంట నూనెలు, కారం, పసుపు, పప్పులు, స్వీట్లు తదితర ఆహార పదార్థాల నాణ్యతపై అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. నాసిరకం, కల్తీ పదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
పండగల ఆనందం సామాన్యుడికి ఆర్థిక భారంగా మారకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ధరలను పూర్తిగా నియంత్రించలేకపోయినా.. కొలతల్లో మోసం, కల్తీ, నాసిరకం సరుకులకు మాత్రం తావులేకుండా కఠిన నిఘా అవసరం. పండగల వేళ ప్రజల జేబుకు, ఆరోగ్యానికి రక్షణ కల్పించేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి.








