గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత కాలేయ మార్పిడి చికిత్స పొందుతూ మురళీధర్ అనే వ్యక్తి మృతి.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించాడని కుటుంబ సభ్యుల ఆరోపణ
45 రోజుల చికిత్సకు రూ.85 లక్షలు వసూలు చేశారని ఆవేదన.
రూ.14 లక్షలు కట్టించుకున్నాకే మరణవార్త చెప్పారని బంధువుల కన్నీరు
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: గచ్చిబౌలి లోని ప్రైవేటు AIG ఆసుపత్రిలో మరోసారి ఆసుపత్రి బిల్లుల దందా బహిర్గతమైంది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన వ్యక్తి కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
వివరాల్లోకి వెళితే, కుత్బుల్లాపూర్‌కు చెందిన మురళీధర్ (40) కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం 45 రోజుల క్రితం ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కాలేయ మార్పిడి అవసరమని వైద్యులు చెప్పడంతో, అవయవదానం కోసం జీవన్‌దాన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, మురళీధర్ వయసు 40 ఏళ్లు కాగా, ఆసుపత్రి సిబ్బంది పొరపాటున 60 ఏళ్లుగా నమోదు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ తప్పిదం వల్ల అవయవదాతలు ఎవరూ ముందుకు రాలేదని, దీంతో చివరికి అతని భార్యే కాలేయాన్ని దానం చేసేందుకు ముందుకొచ్చారని వారు తెలిపారు .రోగి కుటుంబం ఆసుపత్రి అధికారులతో రూ.35 లక్షల ప్యాకేజీకి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, చికిత్స పూర్తయిన తర్వాత ఆసుపత్రి నిర్వాహకులు రూ.85 లక్షల బిల్లు వేశారు. ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చిన కుటుంబం ఆర్థికంగా కుంగిపోయింది.
అయితే, బిల్లు చెల్లించిన కొద్దిసేపటికి రోగి మరణించాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు, రోగి రెండు రోజుల క్రితమే మరణించి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రి ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి నిర్వాహకుల నిర్లక్ష్యం, బిల్లుల దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు…









