నూతన వారపు సంత ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆహ్వానించిన సమితి సింగారం సర్పంచ్ మాధవరావు,
గోల్డెన్ న్యూస్/ మణుగూరు / మండలంలోని బస్ డిపో – జూనియర్ కళాశాల సందులో నూతనంగా ఏర్పాటు చేయనున్న వారపు సంత (అంగడి) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ శనివారం మణుగూరు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను మర్యాదపూర్వకంగా కలిసి సంత ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాధవరావు మాట్లాడుతూ, మణుగూరు ప్రజల సౌకర్యార్థం బస్ డిపో – జూనియర్ కళాశాల సందులో నూతన వారపు సంతను ఏర్పాటు చేసినట్లు *ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి* వివరించారు. గతంలో వారపు సంత కోసం ప్రజలు దూరంలోని పీవీ కాలనీకి వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం మణుగూరులోనే సంత ఏర్పాటు కావడంతో ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు ఎంతో ప్రయోజనం పొందనున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారుమాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే ఈ కార్యక్రమానికి హాజరై నూతన వారపు సంతను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేస్తున్న ఇటువంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
ఈ నెల 28వ తేదీ (ఆదివారం) సాయంత్రం 4:00 గంటలకు నూతన వారపు సంత ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు, వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, విప్పల సింగారం ఉపసర్పంచ్ గోరంట్ల కనకయ్య, కాంగ్రెస్ నాయకులు S గణేష్ రెడ్డి, యాకుబ్ అలీ, ఎం రవీంద్ర నాథ్, ఏ ఎం చారి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.








