అయోధ్యలోని రామ్‌లల్లా ఆలయంపై కాషాయ జెండా ఎగిరింది. ఇవాళ జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. శిఖరంపై ఏర్పాటు చేసిన ధ్వజ స్తంభంపై జెండాను ఆయన ఆవిష్కరించారు.
అయోధ్య: అయోధ్యలో నిర్మించిన రామాలయం పై ఇవాళ ధ్వజారోహణం జరిగింది. ఆలయ శిఖరంపై ఏర్పాటు చేసిన ధ్వజస్తంభంపై కాషాయ జెండా ఎగిరింది. దీంతో అయోధ్య రామాలయ నిర్మాణం సంపూర్ణమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఇవాళ ఉదయం 11.50 నిమిషాలకు జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ అద్భుత ఘటాన్ని తిలకించిన కాషాయ భక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అయోధ్య రామ్‌లల్లా ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఉత్తర భారత దేశానికి చెందిన నగరా శైలిలో ఆలయాన్ని నిర్మించారు.
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మళ్లీ అలాంటి పవిత్రమైన, చరిత్రత్మాక ఘట్టం ఇది. ధ్వజారోహణ కార్యక్రమంలో అయోధ్య మందిర నిర్మాణ ప్రక్రియ పరిపూర్ణం అయింది.ఈ వేడుకను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయోధ్య ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగింది.









