గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పల్లె పోరు ఘట్టం రానే వచ్చింది. ఈ సందర్భంగా పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడంతో జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా ఓటరు జాబితా ప్రకటించడంతో పాటు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆశవాహకులు అందరితో మమేకమై తమకు మద్దతు ప్రకటించాలని ఓటర్లను మన్నన చేసుకుంటున్నారు . గురువారం నుంచి అభ్యర్థులు నుంచి నామినేషన్ వేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 8 మండలాల్లోని 159 గ్రామాలు, 1,436 వార్డులకు, రెండో విడత 14న 7 మండలాల్లోని 156 గ్రామాలు, 1,392 వార్డులకు, మూడో విడత డిసెంబర్ 17న 7, మండలాల్లోని 156 గ్రామాలు, 1340 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.
22 రోజులపాటు సందడి సందడి
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మూడో విడత పోలింగ్ డిసెంబరు 17న జరగనుంది. బుధవారం నుంచి సరిగ్గా 22 రోజులు పల్లెల్లో సందడి నెలకొననుంది. ఆశావహులు మద్దతు కోసం ప్రధాన పార్టీల నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని, ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో నిమగ్నమవ్వనున్నారు. రాజకీ పార్టీల గుర్తులపై జరిగే ఎన్నికలు కాకున్నా వాటి మద్దతుతో అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. రాజకీయ పక్షాలు కూడా గెలుపోటములను తమ ఖాతాల్లో వేసుకొనే ప్రయత్నాలు చేయనున్నాయి.










