పల్లె పోరు. సోషల్ మీడియాలో ప్రచారం జోరు..
గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ / పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వేడి రాజుకుంది. ఒకప్పుడు రచ్చబండలు, గ్రామ కూడళ్లలో జరిగే పంచాయితీ ప్రచారం ఇప్పుడు ప్రతీ ఒక్కరి అరచేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు చేరింది. వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్ పేజీలే ఎన్నికల ప్రచార క్షేత్రాలుగా మారాయి.
పల్లె సమరంలో ప్రచారం హోరెత్తుతోంది.. హామీల వర్షం కురుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులు, గెలుపే ధ్యేయంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అభివృద్ధి వాగ్దానాలతో పాటు, కుల సంఘాలకు, యువజన సంఘాలకు లక్షణంగా నజరానాలు సమర్పిస్తూ, ఓటర్లకు గాలం వేస్తున్నారు.
అభ్యర్థులు వారి అనుచరులు సామాజిక మాధ్యమాలనే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ఎక్స్ వంటి వేదికలపై పోటాపోటీగా పోస్టులు పెడుతున్నారు. బరిలో ఉన్న ప్రత్యర్థి పై ఎన్నికల్లో పై చేయి సాధించడానికి రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగేందుకు ప్రయ త్నాలు ముమ్మరం చేశారు. అయితే ప్రజలు ఎవరికి పట్టం పడతారో ఎన్నికల వరకు వేసి చూడాల్సిందే..
పల్లె ప్రచారం కొత్త పుంతలు
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. అభ్యర్థులు వినూత్న రీతుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ‘ఉచితం’ ఎరలు తెరపైకి వస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు కొందరు అభ్యర్థులు ‘ఫ్రీ’ అంటూ గాలం వేస్తున్నారు. మరికొందరు తమ వాగ్దానాలకు సంబంధించి బాండ్లు సైతం రాసిస్తుండటం విశేషం. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ నమూనా బ్యాలెట్ పత్రాలతో గుర్తులను ఓటర్లకు చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి అభ్యర్థులు ఓట్లు అడుగుతున్నారు. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో ప్రతి ఓటరును కలిసి గుర్తులను చూపిస్తున్నారు. తమకే ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు.











