పినపాక అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ కు పినపాక ఎమ్మెల్యే వినతి.
గోల్డెన్ న్యూస్ / మణుగూరు / పినపాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి నియోజకవర్గాలోని సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి అవసరాలపై చర్చించి అభివృద్ధికి సహకరించాలని వినతి పత్రం అందజేశారు.
ప్రధాన సమస్యలు :- పులుసుబంత ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయాలని, అలాగే భూపతిరావుపేట, చింతల బయ్యారం, అన్నారం ప్రాంతాల్లో గోదావరి ఆధారిత ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం సమర్పించారు. అదే విధంగా కిన్నెరసాని నదిపై ఎత్తిపోతల పథకాలు, జిల్లేరు వాగు, మల్లన్న వాగు, 7 మేకల వాగులపై సాగునీటి పథకాలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా టేకులపల్లి మండలంలో ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్టును విభజించి, గుండాల మరియు ఆళ్లపల్లి మండలాలను కలిపి కొత్త ఐసిడిఎస్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా టేకులపల్లి పీఎస్ సర్కిల్ పరిధిలో ఉన్న ఆళ్లపల్లి మండలాన్ని గుండాల సర్కిల్‌లో కలపాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గంలో ఫారెస్ట్ అనుమతులు లేక నిలిచిపోయిన అభివృద్ధి పనులకు తక్షణమే అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయాలని, అలాగే భవిష్యత్ అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతులు సులభంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరారు.
విద్యారంగ అభివృద్ధిలో భాగంగా కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల్లో కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మంజూరు చేయాలని, ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కోసం సారాపాక, మొండికుంట, రామానుజవరం ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా అటవీ ప్రాంతాల్లో సాగు చేసుకుంటున్న గిరిజన మరియు రైతులకు పోడుపట్టాలు మంజూరు చేయాలని, వారి జీవనోపాధి భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కి వివరించారు.
పినపాక నియోజకవర్గంలో ఉన్న పలు కీలక సమస్యలు, అభివృద్ధి అవసరాలను సమగ్రంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.









