పెంపుడు ప్రేమ ఓ విద్యార్థిని ప్రాణాలు తీసింది. తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లి చనిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న ఓ డిగ్రీ విద్యార్థిని పిల్లిని పెంచుకుంటుంది.
అయితే, ఇటీవల ఆ పిల్లి అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి ఆ యువతి మానసికంగా కుంగిపోయింది. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా గడపసాగింది. ఈ క్రమంలో బుధవారం హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది.
కొంతసేపటి తర్వాత గదికి వచ్చిన తోటి విద్యార్థినిలు.. ఆమె అపస్మారకస్థితిలో పడివుండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాథమిక విచారణలో పిల్లి చనిపోయిన బాధతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు.









