నల్లగా ఉన్నాడనే కారణంతో భర్త హత్య…

నల్లగా ఉన్నాడనే కారణంతో భర్త హత్య… ప్రియుడితో కలిసి సుపారి గ్యాంగ్‌కు ఆర్డర్ ఇచ్చిన భార్య అరెస్టు

 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తన భర్త నల్లగా ఉన్నాడని, తన స్థాయికి సరిపోడని భావించిన భార్య, ప్రియుడితో కలిసి సుపారి గ్యాంగ్‌ను పెట్టి భర్తను హతమార్చించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

 

థార్ జిల్లాలో నివసిస్తున్న దేవకృష్ణ (28) తన భార్య ప్రియాంక పురోహిత్ (25)తో కలిసి జీవిస్తున్నాడు. ఈ నెల 7వ తేదీ రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దేవకృష్ణపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఘటన అనంతరం ప్రియాంక కన్నీరు పెట్టుకుంటూ, దొంగతనానికి వచ్చిన వ్యక్తులు తనను కట్టేసి, తన భర్తను చంపి ఇంట్లో ఉన్న నగదు, నగలను ఎత్తుకెళ్లారని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.

 

అయితే ఆమె చెప్పిన కథలో అనేక అనుమానాస్పద అంశాలు కనిపించడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రియాంక కాల్ డేటాను పరిశీలించగా, కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

 

పోలీసుల కఠిన విచారణలో కమలేష్ పురోహిత్, ప్రియాంక ఇద్దరూ కలిసి సురేంద్ర భాటియా అనే వ్యక్తికి సుపారి ఇచ్చి దేవకృష్ణను హత్య చేయించినట్లు అంగీకరించారు. తన భర్త నల్లగా ఉండటం, తనకు సరిపోడని భావించడం, అలాగే ప్రియుడితో ఉన్న సంబంధం బయటపడే భయంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రియాంక పురోహిత్, కమలేష్ పురోహిత్ మరియు సుపారి గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram