గోదావరి ఒడ్డున పేలుడు పరికరాలు… గేదెలకు తీవ్ర గాయాలు.

గోల్డెన్ న్యూస్ /మంచిర్యాల / జన్నారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని బాదంపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రవాహ ఒడ్డున ఆదివారం ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. వన్యప్రాణులను వేటాడేందుకు గుర్తుతెలియని వేటగాళ్లు పేలుడు పరికరాలు అమర్చినట్లు సమాచారం.

గ్రామానికి చెందిన పశువుల కాపరులు తమ గేదెలను మేత కోసం గోదావరి తీర ప్రాంతానికి తీసుకువెళ్లగా, మేత కోసం తిరుగుతున్న పశువులలోని కొన్ని ఆ పేలుడు పరికరాలను తినడంతో ఒక్కసారిగా పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలు గేదెలకు తీవ్ర గాయాలు కావడంతో కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గాయపడిన పశువులను సమీపంలోని పశు వైద్యశాల వద్ద చికిత్సకు తరలించారు.

ఈ ఘటనతో గ్రామస్థుల్లో భయం నెలకొంది. వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఇలాంటి ప్రమాదకర పేలుడు పరికరాలు అమర్చడం వల్ల పశువులు బలవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇక, ఇదే ప్రాంతంలో మూడు రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పేలుడు పరికరాలను తినడం వల్ల నాలుగు మేకలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామ ప్రజల్లో మరింత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు. బాధ్యుల్ని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram