భార్య చేతిలో ఆర్ఎంపీ డాక్టర్ హత్య

 

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్/ ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో జరిగిన ఆర్ఎంపీ డాక్టర్ వెంకట కోటిరెడ్డి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. మొదట గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని చెప్పిన భార్యే.. తన కుమార్తెతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. భర్త వేధింపులు, ప్రాణభయం కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.

 

ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి సమయంలో కోటిరెడ్డి తన ఇంట్లో మృతదేహంగా కనిపించాడు. ఈ ఘటనపై భార్య ఆదిలక్ష్మి.. గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన ఆధారాలు, ఆమె ఇచ్చిన సమాధానాల్లో ఉన్న విరుద్ధతలు పోలీసులకు అనుమానం కలిగించాయి.

 

దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. విచారణలో ఆదిలక్ష్మి.. తన భర్త కొంతకాలంగా ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకుని, తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని తెలిపింది. మాల ధరించిన సమయంలోనూ హింసించడమే కాకుండా, మాల తీసిన తర్వాత చంపేస్తానని బెదిరించాడని చెప్పింది. ఈ కారణాల వల్లే ప్రాణభయంతో హత్యకు పాల్పడినట్లు ఆమె ఒకుందని పోలీసులు తెలిపారు.

ఈ హత్యకు ముందే ఆదిలక్ష్మి తన కుమార్తె ప్రగతితో కలిసి పథకం వేసినట్లు తేలింది. గ్రామానికి చెందిన వేల్పుల ప్రసంగి సహకారంతో మత్తు బిళ్ళలు తెప్పించుకున్నారు. ఉగాది రోజున పాయసంలో కలిపి ఇచ్చినా అవి పనిచేయలేదు. తర్వాత 11వ తేదీ రాత్రి మళ్లీ పాయసంలో సుమారు 50 మత్తు బిళ్ళలు కలిపి ఇచ్చారు. కోటిరెడ్డి మత్తులోకి వెళ్లిన తర్వాత.. కళ్లలో కారం కొట్టి, రోకలిబండతో తలపై బలంగా కొట్టి హత్య చేశారు.

 

ఈ కేసులో అద్దంకి పోలీసులు భార్య ఆదిలక్ష్మిని ఏ1గా, కుమార్తె ప్రగతిని ఏ2గా, సహాయం చేసిన ప్రసంగిని ఏ3గా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఒక బైక్, హత్యకు ఉపయోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకున్నారు. భర్త వేధింపులు, కుటుంబ విభేదాలు చివరకు ఈ దారుణానికి దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram