పకడ్బందీగా జనగణన సర్వే నిర్వహించాలి కలెక్టర్

గోల్డెన్ న్యూస్ / అశ్వాపురం/ సంక్రాంతి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ పలు కార్యక్రమాలను ఆకస్మికంగా పరిశీలించారు. మల్లెలమడుగు గ్రామంలో నిర్వహిస్తున్న సెన్సస్–2027 జనగణన ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించిన అనంతరం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రం, సీతారాంపురంలోని శివసాయి రైస్ మిల్‌ను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణల్ శ్రేష్ఠ కూడా కలెక్టర్ వెంట పాల్గొన్నారు.

 

మల్లెలమడుగు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లతో కలెక్టర్ మాట్లాడి, వివరాల నమోదు విధానం, డేటా సేకరణ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం దేశంలో జరుగుతున్న 16వ జనగణన ఇదేనని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి జనగణన కావడం విశేషమన్నారు. ఈసారి తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు.

 

జనగణనలో మొత్తం 34 ప్రశ్నలు ఉంటాయని, ఒక్కో కుటుంబానికి సంబంధించిన వివరాలను సుమారు ఐదు నిమిషాల్లోనే నమోదు చేయవచ్చని కలెక్టర్ వివరించారు. ఎన్యూమరేటర్ల ఐడీ కార్డులపై ఉన్న క్యూ ఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేస్తే వారి పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలు అధికారిక సిబ్బందికి సహకరించి ఖచ్చితమైన సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచార సేకరణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, ప్రతి ఇంటిని కవర్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

ఈ పరిశీలనలో సర్పంచ్ మర్రి సంధ్యారెడ్డి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, తాసిల్దార్ సూర్యప్రకాష్, వ్యవసాయ శాఖ ఏడి తాతారావు, ఏఎస్ఓ రాజ్యలక్ష్మి, ఆర్‌ఐ లీలావతి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram