రూ.25 వేల లంచం డిమాండ్.. ఏసీబీ వలలో సీనియర్ అకౌంటెంట్
నాగర్ కర్నూల్ : ప్రభుత్వ పని చేసేందుకు లంచం డిమాండ్ చేసి, స్వీకరించిన సబ్ డివిజనల్ ట్రెజరీ కార్యాలయ సీనియర్ అకౌంటెంట్ ఏసీబీకి చిక్కారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సబ్ డివిజనల్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కందాడ వెంకటయ్యపై అవినీతి నిరోధక శాఖ (ACB) క్రిమినల్ మిసకండక్ట్ కేసు నమోదు చేసింది.
ఏసీబీ వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి మెడికల్ లీవ్, సంబంధిత బిల్లులు, అలవెన్సుల ప్రాసెసింగ్ చేసేందుకు సీనియర్ అకౌంటెంట్ వెంకటయ్య రూ.25,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో ఫిర్యాదుదారుడు ఈ మొత్తంలో రూ.3,000 నగదుగా 2026 ఆగస్టు 14న చెల్లించారు. మిగిలిన రూ.22,000ను 2026 ఆగస్టు 18న ఫోన్‌పే ద్వారా బదిలీ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగిగా తన అధికారిక విధులను నిర్వర్తించే సమయంలో వెంకటయ్య అక్రమ ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో అనుచితంగా, నిజాయితీకి విరుద్ధంగా వ్యవహరించినట్లు ఏసీబీ పేర్కొంది.
ఈ కేసులో నిందితుడైన అధికారిని SPE & ACB కేసుల కోసం నాంపల్లిలోని గౌరవనీయ అదనపు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ వెల్లడించలేదు.








