బాలల రక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

బాలల రక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి

 

బాలలపై లైంగిక వేధింపుల నిరోధానికి పోక్సో చట్టం ప్రత్యేక రక్షణ

 

మంచి స్పర్శ, చెడు స్పర్శపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి

 

మణుగూరు : బాలలపై లైంగిక వేధింపులను నిరోధించడం, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి అన్నారు . జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) ఆధ్వర్యంలో చేపట్టిన సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం మణుగూరు రాజీవ్ గాంధీ నగర్‌లోని రాధిక కాన్సెప్ట్ పాఠశాలలో బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో చట్టం–2012)పై న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి మాట్లాడుతూ బాలలపై లైంగిక వేధింపులు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పోక్సో చట్టం ప్రత్యేక రక్షణ కల్పిస్తుందని తెలిపారు.

 

విద్యార్థులు మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బాలల భద్రతకు సంబంధించి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని నిర్భయంగా వెల్లడించేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

 

బాలల హక్కులు, వారికి చట్టపరంగా లభించే రక్షణపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని మెజిస్ట్రేట్ సూచించారు. బాలలపై జరిగే నేరాలను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురు కృష్ణ, న్యాయవాదులు కె. నరసింహారావు, లీగల్ ఎయిడ్ కౌన్సెల్ పి. పద్మావతి, ఎ. సర్వేశ్వరరావు, ఎం. వాసవి, పాఠశాల చైర్మన్ జి. మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరేష్, కోర్టు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram