ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృతి

శిథిలాల కింద చిక్కుకున్న నలుగురు..

ముగ్గురు మృతి, మరొకరికి స్వల్ప గాయాలు

 

Web desk : దీపావళి పండుగ వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ పంకీ పడావ్‌ ప్రాంతంలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో 20 రోజుల పసికందుతో పాటు అతడి తల్లి, నాన్న‌మ్మ ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

 

ప్రమాద సమయంలో మట్టి గదిలో వినోదిని శుక్లా (60), ఆమె కుమారుడు హర్ష్‌ శుక్లా (32), కోడలు అన్షిక శుక్లా (28), మనవడు ఆరవ్‌ ఉన్నారు. వెదురు దూలాల ఆధారంగా మట్టితో వేసిన పైకప్పు అకస్మాత్తుగా కూలింది. దీంతో నలుగురూ శిథిలాల కింద చిక్కుకుపోయారు. పెద్ద శబ్దం విని పరుగున వచ్చిన స్థానికులు శిథిలాలను తొలగించి వారిని బయటకు తీశారు. వెంటనే కల్యాణ్‌పూర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. వినోదిని, అన్షిక, ఆరవ్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హర్ష్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

 

ప్రమాదం జరిగిన సమయంలో అన్షిక తన 20 రోజుల కుమారుడికి పాలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పైకప్పు కూలుతున్న సమయంలో బిడ్డను కాపాడేందుకు ఆమె అతడిని గట్టిగా హత్తుకుని తన శరీరం కిందకు తీసుకున్నట్లు శిథిలాలను తొలగించిన స్థానికులు వెల్లడించారు. అయినప్పటికీ ఈ ప్రమాదంలో తల్లీబిడ్డ ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. హర్ష్ శుక్లా పంకీలోని స్టీల్‌ అథారిటీకి చెందిన సంస్థలో పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితమే అన్షికను వివాహం చేసుకోగా.. 20 రోజుల క్రితమే వారికి కుమారుడు జన్మించాడు.కాగా, అవధేశ్‌ శుక్లా (65)కు చెందిన సుమారు 35 ఏళ్ల నాటి పూర్వీకుల ఇల్లు నాలుగు గదులతో ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన, చిన్న కుమారుడు రాజు శుక్లా (29) మరో గదిలో ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Facebook
WhatsApp
Twitter
Telegram