గుండాల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగాగుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అక్కడ అందిస్తున్న వైద్య సేవలు, రక్త పరీక్షలు, మందుల నిల్వలు, వైద్య పరికరాల లభ్యతపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. మందుల గదిని పరిశీలించగా అత్యవసర వైద్య అవసరాలకు ఉపయోగించే సిరంజీలు అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించి కారణాలను ప్రశ్నించారు. ఇంటర్నెట్ సమస్యల కారణంగా మందులు, వైద్య సామగ్రి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటికే ఇండెంట్ పెట్టామని వైద్యాధికారులు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సిరంజీలు, అవసరమైన మందులు, వైద్య పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇన్పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, మందులు, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మారుమూల ప్రాంత ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో సర్పంచ్ రాధా, తహసీల్దార్ సంగీత, ఎంపీడీవో బాలరాజు, ఎంఈఓ పార్వతి, ఎంపీవో త్రిలోక్, సర్వేయర్ శివకృష్ణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.









