విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్

గుండాల ఏకలవ్య పాఠశాలలో లోపాలపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి..

ప్రిన్సిపాల్‌కు మెమో, వంట మనిషిని తొలగించాలని ఆదేశం

 

గుండాల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం  ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధన, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజన సదుపాయాలను పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులు లేకపోవడాన్ని గమనించి, తరగతుల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. విద్యార్థుల విద్యాభ్యాసానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, సాంస్కృతిక కార్యక్రమాలను సెలవు రోజుల్లో నిర్వహించుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.

 

పాఠశాల మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వంటశాల, స్టోర్ రూమ్‌ను పరిశీలించగా బంగాళాదుంపలు కుళ్లిపోయి ఉండటం, పంచదారలో చీమలు పట్టి ఉండటాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వంట మనిషిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ సాంబార్, రసం పలుచగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోజు ప్రభుత్వ మెనూ ప్రకారం బిర్యానీ వడ్డించాల్సి ఉండగా, అందుకు అనుగుణంగా భోజనం సిద్ధం చేయకపోవడాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని స్పష్టం చేశారు.

 

పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన, పారిశుద్ధ్యం, భోజన నాణ్యత, ఆహార పదార్థాల నిల్వలో గుర్తించిన లోపాలపై ప్రిన్సిపాల్‌కు మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

 

ఈ పర్యటనలో సర్పంచ్ రాధా, తహసీల్దార్ సంగీత, ఎంపీడీవో బాలరాజు, ఎంఈఓ పార్వతి, ఎంపీవో త్రిలోక్, సర్వేయర్ శివకృష్ణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram