భూ రీ సర్వే పనులు వేగవంతం చేయాలి కలెక్టర్ అంకిత్

భూ రీ సర్వే పనులు వేగవంతం చేయాలి.. రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలి

 

గుండాల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం గుండాల రెవెన్యూ పరిధిలో జరుగుతున్న భూ రీ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ సర్వే పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 10,390 ఎకరాల విస్తీర్ణంలో 6,694 ఎకరాలు అటవీ భూములుగా ఉన్నాయని, అటవీ శాఖ గెజిట్ ప్రకారం నిర్దేశించిన హద్దులు, ఎన్‌క్లోజర్ లేయర్ల ఆధారంగా మిగిలిన భూముల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 950 ఎకరాల్లో సర్వే పూర్తికాగా, అందులో 561 ఎకరాల ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించినట్లు సిబ్బంది వివరించారు.

 

రైతుల సమక్షంలోనే భూముల హద్దులను నిర్ధారించాలని, వారి పేర్లు, సంతకాలు, ఆధార్, మొబైల్ వివరాలను ఫీల్డ్ రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. పహాణీ, పట్టాదారు పాస్ పుస్తకాల వివరాలతో పాటు ప్రస్తుతం సాగు చేస్తున్న రైతుల వివరాలను కూడా నమోదు చేయాలన్నారు. అటవీ, అసైన్డ్, రెవెన్యూ భూములకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, రైతుల అభ్యంతరాలను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు. సర్వే పూర్తయిన అనంతరం హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని, భూ రీ సర్వే ప్రక్రియను నవంబర్ 15వ తేదీలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీజీపీఎస్ (DGPS) పరికరాల పనితీరును కూడా పరిశీలించారు.

 

ఈ పర్యటనలో సర్పంచ్ రాధా, తహసీల్దార్ సంగీత, ఎంపీడీవో బాలరాజు, ఎంఈఓ పార్వతి, ఎంపీవో త్రిలోక్, సర్వేయర్ శివకృష్ణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram