జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో కరకగూడెం బాలిక శ్రీ తేజకు స్వర్ణ పతకం

 తొలెం శ్రీ తేజను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు

 

భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలానికి చెందిన గిరిజన బాలిక తొలెం శ్రీ తేజ ఇటీవల చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 41వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచింది. 100 మీటర్ల హర్డిల్స్, హెప్టాథ్లాన్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయిలో జిల్లా కీర్తిని చాటింది.

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ గారు శ్రీ తేజను, ఆమె కోచ్ పి. నాగేంద్ర బాబును ప్రత్యేకంగా అభినందించారు.

 

ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతమైన కరకగూడెం నుంచి అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో రెండు బంగారు పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమని అన్నారు. శ్రీ తేజ సాధించిన విజయం జిల్లా గిరిజన బాలికలకు గొప్ప స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని మరింత మంది బాలికలు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు.

 

కఠోర శ్రమ, క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రతతోనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు. భవిష్యత్తులో భారతదేశం తరఫున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని శ్రీ తేజకు సూచిస్తూ అభినందించారు.

 

అలాగే జాతీయ అథ్లెటిక్స్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ గారి మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతూ శ్రీ తేజ ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె. మహీధర్ పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram