ఎలుక రెట్టలు, కుళ్ళిన మాంసం 14 రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు!

భాగ్యనగరంలో బిర్యానీ, చాయ్, రుచికరమైన వంటకాల కోసం నిత్యం వేలాది మంది క్యూ కట్టే ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్ల అసలు బండారం ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడుల్లో బట్టబయలైంది. టీజీ సేఫ్ విభాగం ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 22 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు గోల్కొండ, చార్మినార్ జోన్లలో ఏకకాలంలో భారీ తనిఖీలు చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో నగరంలో అత్యంత పేరుగాంచిన షాగౌస్, హోటల్ నయాబ్, మెహఫిల్, సొహైల్ వంటి రెస్టారెంట్ల వంటగదుల్లో కనిపించిన దృశ్యాలు అధికారులనే నివ్వెరపరిచాయి.

 

ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి తీవ్రమైన అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన మొత్తం 14 ప్రముఖ రెస్టారెంట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను అధికారులు తక్షణమే సస్పెండ్ చేస్తూ, వాటి కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల సందర్భంగా ప్రముఖ హోటళ్ల వంటగదుల్లో వెలుగుచూసిన పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. కుళ్ళిపోయిన కూరగాయలు, ఫంగస్ పట్టిన ఆహార పదార్థాలు, ఎక్స్‌పైరీ అయిపోయిన సరుకులను యథేచ్ఛగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పచ్చి మాంసాన్ని, శాకాహార వంటకాలను నిబంధనలకు విరుద్ధంగా ఒకేచోట నిల్వ ఉంచడం, ఒకసారి వాడిన నూనెనే మళ్లీ మళ్లీ మరిగిస్తూ వంటలు చేస్తుండటం బయటపడింది.

 

అన్నింటికంటే దారుణంగా.. వంటగదుల్లో ఎలుక రెట్టలు, బొద్దింకలు, ఈగలు స్వైరవిహారం చేస్తుండగా, కొన్నిచోట్ల కిచెన్లలో పిల్లులు తిరుగుతున్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. మురుగునీటి నిల్వలు, గ్రీజుతో పేరుకుపోయిన చిమ్నీలు, చితికిపోయిన ఫ్లోరింగ్ నడుమ.. సిబ్బంది కనీసం ఆప్రాన్లు, హెయిర్‌నెట్స్ కూడా ధరించకుండా ఆహారాన్ని తయారు చేస్తున్నారు.

 

లైసెన్సులు రద్దయిన 14 రెస్టారెంట్లలో శాలిబండలోని షాగౌస్ కేఫ్, నయాపూల్ హోటల్ నయాబ్, సంతోష్‌నగర్ లక్కీ రెస్టారెంట్, దిల్సుఖ్నగర్ మెహఫిల్, మలక్‌పేట్ సొహైల్ రెస్టారెంట్‌లతో పాటు టోలిచౌకి, సంతోష్ నగర్‌లలోని శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ హోటళ్లు, గుడిమల్కాపూర్‌లోని శ్రీ బాలాజీ ఫ్యామిలీ ధాబా, సిద్దిఖ్ కబాబ్ సెంట్రల్ కిచెన్, టోలిచౌకి అల్సబా, మాసబ్ ట్యాంక్ డైన్ హిల్, ఎంజేఆర్ రోడ్డులోని అక్షయ టిఫిన్స్, వెంకటేశ్వర హోటల్, రేతిబౌలిలోని అజీబో రాయల్ అరేబియన్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవన్నీ తక్షణమే తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పారు.

అలాగే, ఇంజిన్ బౌలిలోని ప్రతిష్టాత్మక తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్, శాలిబండ పిస్తా హౌస్, చార్మినార్‌లోని హోటల్ సబ్జీ, మండి ఎట్ 36 అరేబియన్ కిచెన్, సంతోష్‌నగర్ స్వీకార్ హోటల్, మాసబ్ ట్యాంక్ గోల్కొండ హోటల్ అండ్ రిసార్ట్స్, టోలిచౌకి ఇంపీరియల్ మల్టీక్యూసిన్ రెస్టారెంట్, బజార్‌ఘాట్ తైబా బేకరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram