దమ్మపేట : మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా దమ్మపేటలొ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి గంజాయి వినియోగిస్తున్న ఆరుగురితో పాటు గంజాయి కలిగి ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్లపెంట గ్రామ శివారులో చోటుచేసుకుంది.
దమ్మపేట ఎస్సై బి. రాజేష్ కుమార్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఆర్లపెంట గ్రామ శివారులోని స్మశాన వాటిక వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఆరుగురు వ్యక్తులను గుర్తించారు. వారిని తనిఖీ చేయగా గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి నిర్వహించిన యూరిన్ డ్రగ్ పరీక్షల్లో టిహెచ్సీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
విచారణలో భాగంగా లంకాలపల్లికి చెందిన పొట్ట సాయికుమార్ సాయి, నాగుపల్లికి చెందిన లవుడియా చైతన్య వద్ద గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి సుమారు పావు కిలో గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.12,500 ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో గంజాయి సేవించిన ఆరుగురితో పాటు గంజాయి కలిగి ఉన్న ఇద్దరిని దమ్మపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు గంజాయి సేవించిన ఆరుగురిని డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించగా, గంజాయి కలిగి ఉన్న ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. గంజాయి సరఫరా, విక్రయాల వెనుక ఉన్న ఇతర వ్యక్తుల వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు యువతకు పలు సూచనలు చేశారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల ఆరోగ్యంతో పాటు జీవిత లక్ష్యాలు, భవిష్యత్తు దెబ్బతింటాయని హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువు, ఉపాధి, అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వ, వినియోగానికి పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో అశ్వారావుపేట సీఐ నాగరాజు, దమ్మపేట ఎస్సై బి. రాజేష్ కుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.









