లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన ఎస్సై

ఆదిలాబాద్ : జిల్లాలోని బజారాహత్నూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సన్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) జి. రమేష్ ఏసీబీ వలలో చిక్కారు. ఓ కేసులో ఫిర్యాదుదారుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.40 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో బుధవారం ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించారు.

 

వివరాల్లోకి వెళ్తే.. వివాహం కాని ఓ యువతి అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. చనిపోయే ముందు యువతి చివరిసారిగా ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడిని నిందితుడిగా చేర్చకుండా ఉండటంతో పాటు, ఎస్సై వద్దఉంచుకున్న అతడి మొబైల్ ఫోన్ను తిరిగి ఇచ్చేందుకు ఎస్సై లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.

మొదట రూ.50 వేలు డిమాండ్ చేసిన ఎస్సై, ఫిర్యాదుదారుడి విజ్ఞప్తి మేరకు చివరకు రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏసీబీ తెలిపింది. లంచం మొత్తాన్ని గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలోని సెంటరింగ్ బాక్సుల కింద పెట్టాలని ఎస్సై సూచించడంతో, ఫిర్యాదుదారుడు ఆయన చెప్పిన విధంగా డబ్బులు అక్కడ ఉంచాడు.ఈ వ్యవహారంపై ముందస్తు సమాచారం మేరకు ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్సైని పట్టుకున్నారు. తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ, అక్రమంగా లబ్ధి పొందేందుకు విధులను దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ పేర్కొంది.

నిందితుడైన ఎస్సై జి. రమేష్ను అరెస్టు చేసి, కరీంనగర్ లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించనున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram