అప్సర హత్య కేసులో.. పూజారికి జీవిత ఖైదు.

తీర్పును వెల్లడించిన జిల్లా కోర్టు

గోల్డెన్ న్యూస్ / రంగారెడ్డి : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ప్రియురాలిని కిరాతకంగా హతమార్చిన పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. కేసు కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైకి చెందిన కురుగంటి అప్సర (30) తన తల్లితో కలిసి సరూర్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటు సీరియల్స్‌లో చిన్న పాత్రల్లో నటిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే ఏపీలోని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా గన్నవరం మండలం నరేంద్ర పురానికి చెందిన వెంకట సూర్య సాయికృష్ణ అదే కాలనిలోని మైసమ్మ దేవాయంలో పూజారిగా చేస్తూనే భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు.  ఆలయానికి వచ్చే క్రమంలో అప్సరతో పూజారి సాయికృష్ణకు పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు.  అప్సర తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో అప్పటికే భార్య, కూతురు ఉన్నా పూజారి సాయికృష్ణ ఎలాగైనా అప్సరను వదిలించుకోవాలని సాయికృష్ణ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారం 2023 జూన్‌ 3న కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను కారులో ఎక్కించుకొని రాత్రి 11 గంటల సమయంలో శంషాబాద్‌ మండలంలోని సుల్తాన్‌పల్లి శివారులోని గోశాల వైపు నిర్మానుష ప్రదేశానికి తీసుకవెళ్లి కారులో గాఢ నిద్రలో ఉన్న అప్సర ముఖంపై కారుపై కప్పే కవర్‌తో ఊపిరి ఆడకుండా చేసేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న బెల్లం కొట్టే రాయితో తలపై కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది.అనంతరం అప్సర మృతదేహాన్ని కారు బాడీ కవరులో చుట్టి డిక్కీలో వేసుకొని సాయంత్రం మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో సరూర్‌నగర్‌ ఎమ్మా ర్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడేశాడు. అప్సర తల్లి తన కూతురి గురించి ప్రశ్నించగా స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని, తానే శంషాబాద్‌లో ఆమె స్నేహితుల కారులో ఎక్కించినట్టు నమ్మబలికాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించడం లేదని నటించాడు. ఏమీ తెలియనట్టు అరుణతో కలిసి శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాయికృష్ణ మాట తీరుపై అనుమానం వచ్చి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై విచారణ జరిపి ఇరువైపులా వాదనలు విని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram