ప్రేమ పేరుతో సాగుతున్న డిజిటల్ నేరాలు
ప్రేమ, అనురాగం మానవ సహజ భావాలు. అయితే అదే ప్రేమను ఆయుధంగా మార్చుకుని వల వేసే మోసగాళ్లు ఇప్పుడు సమాజాన్ని పట్టిపీడిస్తున్నారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి వేదికలే వీరి వేట మైదానాలుగా మారాయి. “నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను”, “నువ్వే నా జీవితం” అనే తీయని మాటల వెనుక భయంకరమైన మోసపు కుట్ర దాగి ఉంటుంది.
ఎలా మొదలవుతుంది?
సాధారణంగా అందమైన ప్రొఫైల్ ఫోటో, నకిలీ పేరు, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పే కథతో పరిచయం మొదలవుతుంది. రోజూ చాటింగ్, వీడియో కాల్స్, ప్రేమ మాటలతో బాధితుడి నమ్మకాన్ని సంపాదిస్తారు. ఆ తర్వాతే అసలు ఆట మొదలవుతుంది—డబ్బు, నగ్న వీడియోలు, బ్లాక్మైలింగ్.
ప్రేమ పేరుతో ఆర్థిక దోపిడీ
హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫేస్బుక్లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడింది. అతను “యూరప్‌లో బిజినెస్ చేస్తున్నాను” అని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత “బిజినెస్‌లో సమస్య వచ్చింది, కొంచెం డబ్బు పంపు” అని కోరాడు. ప్రేమ మీద నమ్మకంతో ఆమె దశలవారీగా రూ. 18 లక్షలు పంపింది. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్. ప్రొఫైల్ డిలీట్. అప్పటికే ఆలస్యం. పోలీసులను ఆశ్రయించగా అది అంతర్జాతీయ సైబర్ మోసం అని తేలింది.
వీడియో కాల్ నుంచి బ్లాక్మైలింగ్ వరకు
వరంగల్‌కు చెందిన ఓ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే వీడియో కాల్‌కు ఒప్పించింది. ఆ కాల్‌ను రికార్డు చేసి, ఆ వీడియోను కుటుంబసభ్యులకు పంపుతానంటూ బెదిరింపులకు దిగింది. లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. భయంతో కొంత మొత్తం పంపినా బెదిరింపులు ఆగలేదు. చివరకు సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ ఖాతా వెనుక ఉన్న గ్యాంగ్ గుట్టు బయటపడింది.
సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరగడం ఒంటరితనం, భావోద్వేగ బలహీనత త్వరగా నమ్మేయడం సిగ్గు, భయంతో ఫిర్యాదు చేయకపోవడం.
జాగ్రత్తలు
ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తిని వెంటనే నమ్మొద్దు వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు ఎప్పటికీ షేర్ చేయవద్దు డబ్బు, బ్యాంక్ వివరాలు ఇవ్వొద్దు అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి.
ఆన్లైన్ ప్రేమలో పడే ముందు ఒక్క క్షణం ఆలోచించడమే మీ భవిష్యత్తును కాపాడుతుంది.









