తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం

 ♦ పదవీకాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు

మున్సిపల్‌ ఎన్నికలను ఫిబ్రవరి రెండో వారంలోగా పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆదివారం ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం జరిగింది. మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం భేటీ వివరాలను మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, సీతక్క మీడియాకు వెల్లడించారు.

 

పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, వాటి పరిధిలోని 2,996 వార్డులు, డివిజన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.

 

చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అభివృద్ధి, పాలనా నిర్ణయాలు తీసుకున్నారు.

 

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డెడికేషన్ కమిషన్ నివేదిక ఇప్పటికే సమర్పించడం, రిజర్వేషన్లు ఖరారవడం, అలాగే ఫిబ్రవరి చివరి వారం నుంచి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఎన్నికలను ఆలస్యం చేయకుండా పూర్తిచేయాలని మంత్రిమండలి అభిప్రాయపడింది.

 

మేడారం జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా రామప్ప, లక్నవరం నుంచి గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా తరలించేందుకు రూ.143 కోట్లను మంజూరు చేసింది. మేడారం పుణ్యక్షేత్రం అభివృద్ధి కోసం ఇప్పటికే 19 ఎకరాల భూసేకరణ పూర్తవగా, మరో 20–21 ఎకరాల భూమిని సేకరించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

 

2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను సమగ్ర ప్రణాళికతో నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని పురాతన దేవాలయాలను ఒక సర్క్యూట్‌గా అభివృద్ధి చేసి, ఈకో టూరిజం దృష్టితో నివేదిక అందించేందుకు కన్సల్టెన్సీని నియమించాలని ఆదేశించింది.

 

హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి టేకోవర్ చేసే అంశంపై చర్చించిన కేబినెట్, వచ్చే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఈలోగా మెట్రో ఫేజ్–2లో భాగంగా A, B విస్తరణలకు సంబంధించి భూసేకరణను వేగవంతం చేస్తూ రూ.2,787 కోట్లను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.

 

అలాగే హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) నుంచి శిల్పా లేఔట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి, నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో లా కాలేజీ ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

 

సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క) మీడియాతో ఈ వివరాలను వెల్లడించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram