వేరొకరిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి

మియాపూర్‌లో దారుణం: వేరొకరిని పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తి దాడి

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ / మియాపూర్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడగా, పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

 

వివరాల్లోకి వెళితే, కాకినాడకు చెందిన నూకరత్నం అనే మహిళ మియాపూర్‌లో హౌస్‌కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. గతంలోనే భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఆమె ప్రసాద్ అనే వ్యక్తిని గత నెల 20న వివాహం చేసుకుంది.

 

అదే ప్రాంతంలో వంటమనిషిగా పనిచేస్తున్న ఆలీషా అలియాస్ పాండు, నూకరత్నం తనకు చెప్పకుండా ప్రసాద్‌ను పెళ్లి చేసుకోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 19న తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌తో కలిసి నూకరత్నం ఇంటికి వెళ్లి తన వెంట రావాలని ఒత్తిడి చేశాడు. అయితే ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన ఆలీషా వెంట తెచ్చుకున్న కత్తితో నూకరత్నంపై దాడి చేశాడు.

 

ఈ దాడిలో నూకరత్నంకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి నిందితుడు ఆలీషా, అతని తండ్రి లాలూను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram