గోల్డ్ న్యూస్ /వెబ్ డిస్క్/ యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరులో ఉన్న పిఎసిఎస్ సహకార సంఘం బ్యాంక్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బ్యాంకు ఉద్యోగులు అర్ధరాత్రి సమయంలో మద్యం సేవిస్తూ పట్టుబడటం తీవ్ర వివాదానికి దారితీసింది.
సమాచారం ప్రకారం, మోత్కూరు పిఎసిఎస్ బ్యాంకులో చైర్మన్ ఛాంబర్లో ఉద్యోగులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, దళారులతో కలిసి అర్ధరాత్రి మద్యం సేవించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
బ్యాంకు ఉద్యోగులు దళారుల ద్వారా లంచాలు తీసుకుని రాత్రి వేళల్లోనే లోన్లు మంజూరు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వ్యవసాయ రుణాలను మంజూరు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం ఉన్న సహకార బ్యాంకులను వ్యక్తిగత లాభాల కోసం వాడుకుంటున్నారని మండిపడుతున్నారు. సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.









