ఏజెన్సీ ప్రాంతంలో నేతకాని కులానికి హక్కులు కల్పించాలి: జాడి శ్రీనివాస్

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ ఏజెన్సీ ప్రాంతంలో తరతరాలుగా నివసిస్తున్న నేతకాని కులానికి ఏజెన్సీ చట్టాల ప్రకారం అన్ని హక్కులు కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతకాని సంఘం అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కరకగూడెం మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

 

వినతిపత్రంలో ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో నేతకాని కులానికి చెందిన ప్రజలు తరతరాలుగా నివసిస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ భూమి, భుక్తి, విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో సరైన గుర్తింపు, హక్కులు లభించడం లేదన్నారు. తాము వలసవాదులు కాదని, స్థానిక ఆదివాసీలతో సమానంగా జీవిస్తున్నప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఏజెన్సీ ప్రాంతంలోని నేతకాని కులానికి అన్ని చట్టబద్ధ హక్కులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. అలాగే కేంద్ర గెజిట్‌లో ఉన్న “మాలసాలె నేతకాని” అనే పేరును తొలగించి, ప్రత్యేకంగా “నేతకాని”గా నమోదు చేసే విధంగా మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram