వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు

గోల్డెన్ న్యూస్ /రాజన్న సిరిసిల్ల/ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొత్త బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడి పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. వేములవాడ మున్సిపల్ పరిధి శాత్రాజుపల్లెకు చెందిన అశోక్ అనే యువకుడు ఈ సాహసానికి ఒడిగట్టాడు. కుటుంబ కలహాల కారణంగా మనస్థాపానికి గురైన అతను, తన భార్యకు విడాకులు ఇప్పించేలా ఒక వ్యక్తి వ్యవహరించాడని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగాడు. ఇప్పటికే తాను పురుగుల మందు సేవించానని, ట్యాంక్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంటానని అతను కేకలు వేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అశోక్‌ను కిందికి దింపేందుకు యత్నించగా, అతను పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ తరుణంలో ఎస్బీ కానిస్టేబుల్ శ్రీనివాస్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఎంతో చాకచక్యంగా వాటర్ ట్యాంక్ ఎక్కి, అశోక్‌ను గట్టిగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే మరికొందరు సిబ్బంది ట్యాంక్ పైకి చేరుకుని అతడిని సురక్షితంగా కిందికి దించారు. అనంతరం ఫైర్ ఇంజిన్ సహాయంతో హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడటంతో స్థానికులు ఆయనను అభినందిస్తున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram