సాధారణంగా మనం కొనే బంగారం ఎక్కడి నుంచి వస్తుందో పెద్దగా ఆలోచించం. కానీ ఇకపై ఆంధ్రప్రదేశ్ నేలలో పుట్టిన బంగారం కూడా ఆ జాబితాలో చేరుతోంది. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్ర ఖనిజ సంపద ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు అవకాశంగా కనిపించిన గని… ఇప్పుడు వాస్తవంగా బంగారం అందిస్తోంది. జొన్నగిరి ప్రాజెక్టు వెనుక ఎన్నో ఏళ్ల అన్వేషణ, శాస్త్రీయ పరిశోధనలు, భారీ పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికత ఉన్నాయి. భూమిలోని ఖనిజాన్ని వెలికితీయడం నుంచి శుద్ధి చేసి బంగారు బిస్కెట్గా మార్చే వరకు ప్రతి దశ అత్యంత కచ్చితత్వంతో సాగుతుంది. ఆ ప్రక్రియ ఫలితమే ఇప్పుడు మార్కెట్లోకి అడుగుపెట్టిన తొలి ఏపీ బంగారం.
బంగారం విలువ కేవలం దాని ధరలోనే లేదు. వేల మందికి ఉపాధి, స్థానిక ప్రాంతాల అభివృద్ధి, రవాణా, అనుబంధ పరిశ్రమల విస్తరణ, ప్రభుత్వానికి రాయల్టీలు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం లాంటి అనేక రూపాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది బలం చేకూర్చనుంది. ఒక గని చుట్టూ కొత్త ఆర్థిక చైతన్యం కనిపించబోతోంది ఇప్పటి వరకు “ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం, సముద్ర సంపద” అనే గుర్తింపు ఉండేది. ఇకపై “బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రం” అనే మరో ప్రత్యేకత కూడా చేరబోతోంది. జొన్నగిరి నుంచి వచ్చిన ఈ తొలి బంగారు బిస్కెట్లు… కేవలం బంగారు ముక్కలు కాదు… రాష్ట్ర భవిష్యత్తుపై కొత్త ఆశలు… కొత్త అవకాశాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.








