ప్రజలకు మెరుగైన పోలీసు సేవలందించడమే లక్ష్యం – డీజీపీ సి.వి. ఆనంద్
గోల్డెన్ న్యూస్ / మణుగూరు /జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రజలకు ఆధునిక సౌకర్యాలతో కూడిన మెరుగైన పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో మణుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ మానిటరింగ్ సెల్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ సహకారంతో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం పూర్తయిందని, ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ సమర్థవంతంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించగలుగుతున్నామని డీజీపీ తెలిపారు. నేరాల నియంత్రణ, దర్యాప్తు, సీసీటీవీ నిఘా, సైబర్ నేరాల విచారణ వంటి అంశాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా సమాజాన్ని వినాశన దిశగా నడిపిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. భావితరాలను ఈ ప్రమాదం నుంచి కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఈగల్ (EAGLE) వంటి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి, కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు సమన్వయంతో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ రహదారి ప్రమాదాల నివారణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేసే ముఠాలను తీవ్రవాదుల మాదిరిగానే పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ నూతన పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించి, పోలీస్ స్టేషన్‌లో కల్పించిన ఆధునిక మౌలిక సదుపాయాలను పరిశీలించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలందించడంలో జిల్లా యంత్రాంగం పోలీసు శాఖతో సమన్వయంగా పనిచేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఈ నూతన పోలీస్ స్టేషన్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
అనంతరం డీజీపీ, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో కలిసి పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ప్రజలకు స్నేహపూర్వక, పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పోలీసు సేవలు అందించాలని పోలీసు అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సింగరేణి సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.









