ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’
తెలంగాణలోని ప్రతీ కుటుంబానికి అధికారికంగా ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జారీ చేయనున్నట్లు ప్రభుత్వ ప్రకటించింది. వివిధ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించే ఈ విధానం పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతీ కుటుంబానికి సంబంధించిన అధికారిక వివరాలను ఒకే చోట పొందుపరిచేలా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జారీ చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
ఈ మేరకు సంబంధిత ప్రభుత్వ శాఖ నుంచి ప్రత్యేకంగా జీవో కూడా జారీ అయింది. ప్రజలు ఏదైనా ప్రభుత్వ పథకాలకు లేదా సేవలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల వివరాలను సమర్పించడంలో ప్రస్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ కొత్త సర్టిఫికెట్ విధానం అందుబాటులోకి వస్తే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ ప్రత్యేకమైన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌లో కుటుంబానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఐడీ నంబర్, ఫ్యామిలీ హెడ్ పేరు, మిగతా కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఆధార్ నంబర్లు, పూర్తి చిరునామా స్పష్టంగా పొందుపరచబడి ఉంటాయి.
ఇది కేవలం ఒక పత్రంలా కాకుండా ప్రతి కుటుంబానికి ఒక అధికారిక గుర్తింపు పత్రంగా నిలుస్తుందని ప్రభుత్వం వివరించింది. ఎవరైనా ఈ సర్టిఫికెట్ పొందాలనుకుంటే ఆన్‌లైన్‌లోనే సులభంగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీనివల్ల దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరమై పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా అందేలా చేయడానికి ఈ డిజిటల్ విధానం ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆన్‌లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకుని ఈ సర్టిఫికెట్‌ను పొందాలని కోరారు.









