లింగారెడ్డిపల్లిలో ఆర్ఎంపీపై గ్రామస్థుల ఆగ్రహం
మహిళను వేధించి వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపణలు
సిద్దిపేట- లింగారెడ్డిపల్లి రహదారిపై గ్రామస్థుల ధర్నా,రాస్తారోకో
నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
వైద్య వృత్తికి కళంకం తెస్తూ.. అమాయక మహిళల జీవితాలతో ఆదుకుంటున్న ఓ ఆర్ఎంపీ దారుణాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. రోగులకు వైద్యం అందించాల్సిన చేతులతోనే కామాంధుడిగా మారి.. మహిళలను లైంగికంగా వేధిస్తూ, వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఘటన సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు రోడ్డెక్కడంతో ఈ వ్యవహారం బయటపడింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. సిద్ధిపేట మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు లింగారెడ్డిపల్లి గ్రామంలో కరుణాకర్ అనే వ్యక్తి ఆర్ఎంపీ వైద్యుడిగా చలామణి అవుతున్నాడు. వైద్యం పేరుతో గ్రామానికి చెందిన ఒక మహిళను లోబరుచుకున్న కరు ణాకర్, ఆమెకు తెలియకుండా వీడియోలు తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని, బాధితురాలిని బెదిరిస్తూ భారీ గా డబ్బులు ఇవ్వాలని తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు.
రహదారిపై ధర్నా..
ఆర్ఎంపీ కరుణాకర్ ఆగడాలు, వేధింపులు తాళలేక బాధితురాలు తీవ్ర మానసిక వేదనకు గురైంది. విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త తీవ్ర ఆగ్రహానికి లోనై కొన్ని
రోజుల క్రితం కరుణాకర్ పై దాడి చేశాడు. అంతేకాకుండా, నిందితుడికి చెందిన కారును కూడా తగలబెట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు కరుణాకర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుడు కరుణాకర్ గతంలో కూడా ఇలాగే పలువురు మహిళలను బెదిరించి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నిందితుడు జైలు నుంచి బయటకు వస్తే మళ్లీ
గ్రామంలో ఇలాంటి ఆగడాలకే ఒడిగడతాడని మండిపడ్డారు. ఈ క్రమంలో లింగారెడ్డిపల్లి గ్రామస్థులు సిద్ధిపేట లింగారెడ్డిపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అతడు మళ్లీ ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. కరుణాకర్‌ను గ్రామం నుంచి శాశ్వతంగా పంపించాలన్నారు.









