హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసి, దేశంలోనే ఆదర్శనగరంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పానికి యాదవ సోదర సోదరీమణులు సంపూర్ణ సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో  నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ సోదర సోదరీమణులకు సదర్ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో కీలకమని సీఎం కొనియాడారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వారిని యాదవ సోదరులు ఆదరించి అక్కున చేర్చుకున్నారని, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధిలోనూ తమదైన పాత్ర పోషించారని ప్రశంసించారు.హైదరాబాద్‌కు జాతీయస్థాయిలో మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావడంలో యాదవులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.యాదవుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సదర్ సమ్మేళన్‌ను అధికారికంగా నిర్వహించలేదని గుర్తుచేస్తూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవుల విజ్ఞప్తి మేరకు సదర్ సమ్మేళన్‌ను రాష్ట్ర ఉత్సవంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు.

మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టి దేశానికి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకంగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. సమాజంలో ఏ వర్గానికి ఎంత జనాభా ఉంటే ఆ మేరకు వాటా కల్పించాలనే లక్ష్యంతో కులగణన నిర్వహించామని తెలిపారు. యాదవులకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించామని చెప్పారు.ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి సభ్యురాలిగా నియమించడంతో పాటు గోశాల బాధ్యతలను కూడా అప్పగించినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఉత్తరప్రదేశ్ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితర ప్రజాప్రతినిధులు, వివిధ రాష్ట్రాలకు చెందిన యాదవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram