భద్రాచలం ఏరియా ఆసుపత్రికి త్వరలో సీటీ స్కాన్

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మరో ముందడుగు పడింది. సీటీ స్కాన్ భవన నిర్మాణం కోసం శుక్రవారం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆసుపత్రి ప్రాంగణంలో స్థలాన్ని పరిశీలించారు.

 

ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని చూపించి, ఆసుపత్రి పరిసరాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల గురించి వివరించారు.

 

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. భద్రాచలం నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం ఇక్కడికి వస్తుంటారని తెలిపారు.

 

ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలను ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సీటీ స్కాన్ వంటి ఆధునిక వైద్య పరికరాల సేవలు అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్సలు స్థానికంగానే పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

 

భద్రాచలం ప్రాంత ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గించేలా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్రా రాము, భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ 12వ వార్డు సభ్యుడు కారం దుర్గారావు, ఏలూరి రాము, యువజన నాయకులు గాడి విజయ్, మాచినేని భాను, వేముల అనిల్, ఆరోగ్యశ్రీ ఇన్‌చార్జ్ సుధాకర్, వైద్యులు, ఏరియా ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram