గొంగడి త్రిషకు కోటి రూపాయల నజరానా… ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, టీమిండియా తరపున రాణించాలని ఆకాంక్ష అండర్ -19 మహిళల T20 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష కి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయలు నజరానా ప్రకటించారు.
వరల్డ్ కప్లో అత్యద్భుతంగా రాణించిన భద్రాచలానికి చెందిన క్రికెటర్ త్రిష గొంగడిని సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. సీఎం రేవంత్ను త్రిష బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా త్రిషను సీఎం శాలువాతో సత్కరించారు. ఈ క్రమంలో రూ.కోటి నజరానాను ప్రకటించారు. భవిష్యత్లో భారత్ తరఫున మరిన్ని టోర్నీల్లో పాల్గొని ఆడాలని సీఎం ఆకాంక్షించారు. అలాగే, టీ20 ప్రపంచకప్ సభ్యురాలైన ధృతి కేసరితో పాటు టీమ్ హెడ్కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి రూ. 10లక్షల చొప్పున నజరానాను సీఎం రేవంత్ ప్రకటించారు.









