దేవుడు పిలుస్తున్నాడంటూ.. కుటుంబం ఆత్మహత్య.

గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : హైదరాబాద్‌లోని అంబర్‌పేట్, మల్లికార్జున నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస్.. అతని భార్య విజయలక్ష్మి, వారి చిన్న కుమార్తె శ్రావ్య ఒకేసారి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవలే పెద్ద కుమార్తె మరణించడంతో.. ఈ కుటుంబం తీవ్ర డిప్రెషన్‌కు లోనైంది. తమను కూడా దేవుడు పిలుస్తున్నాడనే మూఢనమ్మకంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో వీరు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. సూసైడ్ లేఖ రాసినట్లు పోలీసులు గుర్తించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.శ్రీనివాస్ కుటుంబం కొద్ది నెలల క్రితమే రామ్‌నగర్ నుంచి అంబర్‌పేట్‌కు నివాసం మార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉండగా.. ఇటీవల పెద్ద కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషాదమే కుటుంబంలో ఈ  నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..

వారు తరుచుగా స్థానికులతో.. తమను కూడా దేవుడు పిలుస్తున్నాడని.. తాము కూడా పెద్ద కూతురు దగ్గరికే వెళ్తున్నామని చెబుతూ వచ్చేవారట. ఈ మాటలు వారి బలవన్మరణం వెనుక ఉన్న తీవ్ర విషాదాన్ని తెలియజేస్తున్నాయి. పెద్ద కుమార్తెను కోల్పోయిన వీరు.. ఈ లోకంలో బతకడం కంటే, తమ పెద్ద కూతురితో కలిసి స్వర్గంలో ఉండటమే ఉత్తమమని భావించి.. మిగిలిన కుమార్తెను కూడా తమతో పాటు తీసుకువెళ్లడం అనేది జీర్ణించుకోలేని విషాదం. ఈ ఆధునిక యుగంలో కూడా ప్రజలు ఇటువంటి మూఢనమ్మకాలను నమ్మడం ఎంతో బాధాకరం.

Facebook
WhatsApp
Twitter
Telegram